సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొంతమంది మహిళా ఉద్యోగులను ఓ ఉన్నతాధికారి వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, బాధితులు మున్సిపాలిటీ చైర్పర్సన్ కూన వనితను కలిసి తమ సమస్యలను వివరించారు.
సంగారెడ్డి కలెక్టరేట్లోని డీపీవో, హౌసింగ్ శాఖల్లో మహిళా ఉద్యోగులపై అధికారుల వేధింపుల ఘటనలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తాజాగా సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీ కార్యాలయంలోనూ మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది మహిళా ఉద్యోగులను ఓ ఉన్నతాధికారి వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సెలవుపై వెళ్లిన ఓ అధికారితో సదరు మహిళా ఉద్యోగులు చనువుగా ఉంటున్నారనే అనుమానంతో, వారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ వేధింపులు భరించలేక బాధిత మహిళా ఉద్యోగులు మున్సిపాలిటీ చైర్పర్సన్ కూన వనితను కలిసి తమ సమస్యలను వివరించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన చైర్పర్సన్.. తాను కూడా ఒక మహిళనని, కార్యాలయంలో వేధింపులకు గురవుతున్న మహిళా ఉద్యోగులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ జిల్లా కలెక్టర్‌తో పాటు టీజీఐఐసీ మాజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మహిళా ఉద్యోగులపై వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












