తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవనంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాలలు వెంటనే సర్టిఫికెట్లు అందజేయాలని సూచించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్, నీలం వెంకటేష్, ఉపాధ్యక్షుడు అనంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, కోశాధికారి కె. సుధాకర్ గౌడ్, కార్యదర్శులు గౌలీశ్వర్, ఎం.శ్రీనివాస్, ప్రవీణ్, విద్యార్థి సంఘం నాయకుడు శివ తదితరులు పాల్గొన్నారు.












