నర్సింగాపూర్, భీమారం (అక్షరవేకువ) నవంబర్ 11
భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో చెరువు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో చెరువు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఈ చెరువు నిండుగా నీటితో కళకళలాడుతూ, చుట్టుపక్కల పొలాలకు జీవం పోసేది. కానీ ప్రస్తుతం చెరువులో నీటి జాడ కరువైంది. అడుగున బురద తప్ప ఏమీ కనిపించడం లేదు.
ఆకాశం వైపు చూస్తే మబ్బులు కమ్ముకొస్తున్నా, వర్షం కురవడం లేదు. కురిసినా చెరువు నిండేంతగా కురవడం లేదు. రైతు ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి, పొలం గట్టుపై నిలబడి చెరువు వైపు ఆశగా చూస్తున్నాడు.
రైతుల ఆవేదన
తన గోడును వివరిస్తూ, ఈ ఏడాది వర్షం కురుస్తుందా చెరువు నిండుతుందా విత్తనం వేయాలంటే భయం, వేయకపోతే జీవనోపాధి ప్రశ్నార్థకం. బోరు బావులు వేసినా నీళ్లు పడటం లేదు, విద్యుత్ సరఫరాపై భరోసా లేదు. ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో, పంట చేతికి వస్తుందో రాదోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది అని వాపోయాడు.
చెరువు ఎండిపోవడం అంటే కేవలం నీళ్లు ఎండిపోవడం కాదు, రైతు ఆశలు కూడా అడుగంటినట్లేనని రైతులు పేర్కొంటున్నారు. రైతుకు ఆశే పెట్టుబడి, ఓర్పుతోనే సాగు కొనసాగుతుందని వారు తెలిపారు.






