వైఎస్ఆర్ నగర్, ఖాజీపేట (అక్షరవేకువ) నవంబర్ 12
వైఎస్ఆర్ నగర్లోని 120 గుడిసెలను కాపాడాలని, పేద కుటుంబాలకు నివాస భద్రత కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు డాక్టర్ కేడల ప్రసాద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం వైఎస్ఆర్ నగర్ గుడిసెల సమస్యపై వినతిపత్రం సమర్పించారు.
2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో 120 గుడిసెలకు సంబంధించి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి గుడిసెలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదల నివాసాలను కాపాడాలని కోరారు.
అదేవిధంగా, మిగిలిన సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో బస్స్టాండ్, మండల తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మోడెమ్ రాజేందర్ గౌడ్, సామాజికవేత్త తంపుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.







