హైదరాబాద్, 12 November
పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోతే తల్లి పడే కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని, ఆ బాధను తన తల్లి జీవితాన్ని చూసి అర్థం చేసుకున్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈ మానవీయ కోణమే సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచనకు ప్రేరణగా నిలిచిందని తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ తన జీవిత ప్రయాణాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించారని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని పార్టీని నడిపిస్తూ ప్రజాసేవ చేసిన గొప్ప చరిత్ర ఆమె అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ పుస్తకం ఆధారంగా సినిమాను రూపొందించి వచ్చే ఏడాది ఒకటో తేదీ నాటికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తనకు సన్నిహితంగా ఉన్న మంత్రులతో చర్చిస్తానని చెప్పారు. సినిమాలో తన నిజజీవిత పాత్ర సుమారు ఐదు నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. సోనియా గాంధీపై విమర్శలు చేసే వారిని ఉద్దేశించి జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రతి మహిళను తల్లిగా భావించాలని ఆర్ఎస్ఎస్ నేతలు ప్రసంగాలు చేస్తూ, సోనియా గాంధీ విషయంలో మాత్రం విమర్శలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. ఇదేనా వారి సిద్ధాంతమని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తన పుస్తకంలో ఆ విషయాన్ని ప్రత్యేకంగా రాసుకోవాల్సిన అవసరం ఏముందని, ఆ రాష్ట్రాన్ని పొందిన మనమే ఆమె గురించి గొప్పగా రాయాలని అన్నారు. సోనియా గాంధీకి మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, దూరదృష్టితో ఆ పదవిని తిరస్కరించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లను ప్రధాన మంత్రులుగా చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఎదగడానికి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాలు, రాజకీయ పాత్ర కారణమని వ్యాఖ్యానించారు. మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన బోయినపల్లి వినోద్ కుమార్ ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. కంగనా రనౌత్ నాయకురాలు కాదని, ఆమె కేవలం నటిగానే గుర్తింపు పొందారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.







