సంగారెడ్డి, 13 November
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా అమలు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి సూచించారు. గురువారం ఆమె ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోషణ అభియాన్ కార్యక్రమం కింద గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు, సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వ తేదీ వరకు బాలల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను బాలసదనాలు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 16న సంగారెడ్డిలో నిర్వహించే ప్రజావాణిలో ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలు ఈ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేసేలా అవగాహన కల్పించాలని సీడీపీఓలు, సూపర్వైజర్లకు సూచించారు. అదేవిధంగా, నవంబర్ నెలలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, సఖి కేంద్రం, హబ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ల సమన్వయంతో జిల్లాలోని 100 గ్రామాల్లో బాల్యవివాహ రహిత సమాజం లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సీడీపీఓలు చంద్రకళ, జయరాం, సుశీల, సుజాత, సూపర్వైజర్లు, ఈఓ దేవకృప, డీసీపీఓ రత్నం, యునిసెఫ్ కోఆర్డినేటర్లు సౌమ్య, నవీన్, బ్లాక్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.


