సంగారెడ్డి, 13 November
సంగారెడ్డి, నవంబరు 13: ఈ నెల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో పిల్లల ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ, ఈ పిల్లల ప్రజావాణి కార్యక్రమం సాధారణ ప్రజావాణితో పాటు జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మారుమూల గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాల నుండి పిల్లలు ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసి, తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు, సంబంధిత అధికారులకు (ఆరోగ్య, విద్య, పోలీస్, రవాణా, పిల్లల సంక్షేమ శాఖల) వినతి పత్రాలు సమర్పించాలని కోరుతున్నామని తెలిపారు. పిల్లల ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే పిల్లలకు ప్రత్యేక సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్కులు) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారు సమర్పించిన వినతి పత్రాలను నమోదు చేసి, వాటిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో రత్నం, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ యాదగిరి పాల్గొన్నారు.


