సంగారెడ్డి, 2026-11-26
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తున్న బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ఆమోదం పొంది 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నో వైవిధ్యాలు, భిన్న సంస్కృతులు, భాషలు, మతాలు కలిగిన భారతదేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తున్న బలమైన పునాది భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. 77 ఏళ్లుగా అనేక సవాళ్లను అధిగమిస్తూ, కాలానుగుణంగా అవసరమైన మార్పులను స్వీకరిస్తూ భారత రాజ్యాంగం విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి గొప్ప సూత్రాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర దేశాలు సైతం భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రతి పౌరుడు తన బాధ్యతలను కూడా గుర్తించాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రిన్సిపాల్ రామారావు, బీసీ వెల్ఫేర్ ఈడీ జగదీష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుమిత్ర, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్, అంబేద్కర్ స్టడీ సర్కిల్ సభ్యుడు కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.






