భీమారం మండల కేంద్రంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో సంవత్సరాలుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్య, పొలాల నుంచి వచ్చే నీరు నిలిచిపోవడం వల్ల పెరిగిన తుంగ, పాలసంద్రం చెట్ల సమస్యలకు పరిష్కారం లభించనుంది.
కాలనీలో పేరుకుపోయిన మురుగునీరు, నిలిచిపోయిన నీటి వల్ల ఏర్పడిన దట్టమైన తుంగ, పాలసంద్రం చెట్లు ప్రజల జీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల పాములు వంటి విషపురుగులు తిరుగుతూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ఈ సమస్యలపై స్థానిక ప్రజలు సర్పంచ్ విజయలక్ష్మి, పున్నం చందులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులతో కలిసి కాలనీని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ప్రజల ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్, సమస్యల పరిష్కారం కోసం జేసీబీ సహాయంతో పనులు వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో కాలనీ వాసులు ఊరట చెందారు.
కాలనీ వాసులు తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న సర్పంచ్ విజయలక్ష్మి, పున్నం చందులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








