మంచిర్యాల జిల్లాలోని వివేకవర్ధిని డిగ్రీ & పీజీ కళాశాల తన 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
వివేకవర్ధిని డిగ్రీ & పీజీ కళాశాల రజతోత్సవ వేడుకలు పట్టణంలోని సాయిమిత్ర గార్డెన్స్‌లో ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో మెలుగుతూ, ఉన్నత లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.
పోటీ ప్రపంచంలో విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తేనే చదువు సార్ధకమవుతుందని, లక్ష్య సాధనలో కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుందని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి మాట్లాడుతూ, 25 ఏళ్ల క్రితం స్వర్గీయ గొనె హన్మంతరావు ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో, పెద్దల పట్ల గౌరవం కలిగి లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి సూచించారు. గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.








