భీమారం గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 23 లక్షల రూపాయల నిధులను సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి దుర్వినియోగం చేశారంటూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పారిశుధ్యం, తాగునీటి అవసరాల కోసం మంజూరైన నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసి డ్రా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం, గత మూడు నెలల్లో పారిశుధ్యం, తాగునీటి పేరుతో విడుదలైన 23,28,674 రూపాయలను సర్పంచ్ శ్రీమతి ఉష్కామల్ల విజయలక్ష్మి, ఉపసర్పంచ్ కోలా సత్యమ్మ, గ్రామ కార్యదర్శి పెద్దపల్లి మల్లేష్లు తమ బంధువులు, మల్టీ వర్కర్ల పేర్లతో ఉన్న ఖాతాల్లోకి మళ్లించి, దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఈ నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామ సభలో ప్రజలు ఈ నిధుల వినియోగంపై ప్రశ్నించగా, సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి సరైన సమాధానం ఇవ్వకుండానే విషయాన్ని దాటవేశారని గ్రామస్తులు తెలిపారు. ప్రజాధనాన్ని ఇలా వివిధ ఖాతాల్లోకి మళ్లించి, డ్రా చేసి దుర్వినియోగం చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై గ్రామ పంచాయతీ సెక్రెటరీ మల్లేష్‌ను వివరణ కోరగా, మూడేళ్ల నిధులు ఒకేసారి చెల్లించే ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడి ఉండవచ్చని, అయితే నిధుల దుర్వినియోగం జరగలేదని, అన్ని లావాదేవీలకు సంబంధించిన బిల్లులు, రికార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రామస్తులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.










