జర్మనీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వి. వివేక్ వెంకటస్వామి, అక్కడి పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జర్మనీలోని లోయర్ సాక్సోని రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం 'లెటర్ ఆఫ్ ఇంటెంట్'పై సంతకాలు చేసింది. దీని ద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి, శిక్షణ అవకాశాలు మెరుగుపడనున్నాయి.
రాష్ట్ర మంత్రి జి.వి. వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని బృందం ఐదు రోజుల పర్యటనలో భాగంగా జర్మనీలో పర్యటిస్తోంది. సోమవారం జర్మనీకి చేరుకున్న బృందం, బుధవారం హానోవర్‌లో జర్మన్ ఫెడరల్ ఎంప్లాయిమెంట్ ఏజెన్సీతో సమావేశమైంది. తెలంగాణ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు, నైపుణ్యం కలిగిన వారిని జర్మనీకి పంపే అవకాశాలపై చర్చించింది.
మంత్రి వివేక్, రాష్ట్రంలో టామ్‌కామ్ ద్వారా నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల గురించి ఏజెన్సీ ప్రతినిధులకు వివరించారు. అంతర్జాతీయ నైపుణ్య వినియోగం, ఉద్యోగావకాశాల విస్తరణ లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి.
ఈ సమావేశాల నేపథ్యంలో, జర్మనీలోని లోయర్ సాక్సోని రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య 'లెటర్ ఆఫ్ ఇంటెంట్'పై అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి వివేక్, లోయర్ సాక్సోని రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమలు, డిజిటలైజేషన్, మొబిలిటీ శాఖ మంత్రి గ్రాంట్ హెండ్రిక్ టోన్నే పరస్పర ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ ఒప్పందం తెలంగాణ యువతకు జర్మనీలో ఉపాధి, శిక్షణ అవకాశాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది. భవిష్యత్తులో ఇరు ప్రాంతాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.











