మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పార్టీ విమర్శించడం సరికాదని, స్థానిక ఎంపీ వంశీ తమ ఘనతలను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు మాట్లాడుతూ, ఎంపీ వంశీ రెండేళ్లలో డబ్బా ప్రచారం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రామగుండంపై మక్కువతో మంచిర్యాలపై సవతి ప్రేమ చూపుతున్నారని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. గణాంకాలతో తమ విజయాలను బయటపెడతామని, బీజేపీపై వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
దేశానికి ప్రధాని మోడీ ఎంతో అవసరమని, తెలంగాణకు కేంద్రం వేలకోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల ద్వారా అందించిందని రఘునాథరావు తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, చెరువులు, అమృత్ తాగునీరు, జాతీయ రహదారుల విస్తరణ వంటి పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ కృషినేనని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ విమర్శలు మానేసి పనులు చేయాలని సూచించారు. వారి పాలన ప్రజా వ్యతిరేకమని, రైతులు, ప్రజలు, కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ పార్టీని బలోపేతం చేసుకుని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తులా ఆంజనేయులు, రాష్ట్ర బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బోట్ల అనిత సత్యం, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు అరిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.











