మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (SIR)పై బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన శిక్షణ కార్యక్రమంలో కార్మిక, మైనింగ్ & ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్, SIR ముసుగులో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అనుకూల ఓటర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
మంత్రి వివేక్ మాట్లాడుతూ, దేశంలో ఓటు చోరీ అంశంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో గళం విప్పారని గుర్తు చేశారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పకడ్బందీగా పరిశీలించాలని, చనిపోయిన ఓటర్ల వివరాలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అప్పులు చేసి, కమిషన్ల రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తోందని, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహార భోజనం అందిస్తున్నామని, BLAలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం SIR ముసుగులో ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను ఎంపిక చేసినప్పటికీ, ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు.
నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువత ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 120 ATC సెంటర్ల ద్వారా 25 వేల మంది యువతకు, టామ్‌కామ్ (TOMCOM) ద్వారా మరో 10 వేల మంది యువతకు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.










