ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ఆరోపించారు. మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో ర్యాలీ, మౌన ప్రదర్శన నిర్వహించారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని, అత్యవసర పరిస్థితి విధించి రాజకీయ నాయకులను, పాత్రికేయులను జైల్లో పెట్టిందని విమర్శించారు. అప్రజాస్వామికంగా అధికారాన్ని కొనసాగించిన తీరును ఆయన ఎండగట్టారు.
దేశంలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ పార్టీపై ఆయన ధ్వజమెత్తారు. మంచిర్యాల నియోజకవర్గంలో కూడా అటువంటి పరిస్థితులే నెలకొన్నాయని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూల్చివేతలు, సెటిల్మెంట్లతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
చిరు వ్యాపారులను రోడ్డుపాలు చేసిన ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందని రఘునాథ్ వేరబెల్లి విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మున్సిపల్ ఫోర్ లీడర్ గాజ్జుల ముఖేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు దుర్గం అశోక్, కార్పొరేటర్లు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











