తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్చకులకు ప్రధాన దేవాలయాల్లో శీఘ్ర దర్శనం కల్పించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై అర్చక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం తమ పూజా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా, మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి దోహదపడుతుందని వారు తెలిపారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, ఈ ఉత్తర్వులను జారీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, హనుమకొండ సహాయ కమీషనర్ రాముల సునీతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సాధారణంగా డీడీఎన్ పథకం కింద పనిచేసే అర్చకులు ఇతర ఆలయాలకు వెళ్లినప్పుడు సాధారణ భక్తులతో పాటు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని, ఇది తమ ఆలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తోందని సదానిరంజన్ సిద్ధాంతి వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా త్వరితగతిన దర్శనం పూర్తి చేసుకుని తిరిగి తమ ఆలయాలకు చేరుకునే అవకాశం ఏర్పడిందన్నారు.
ఈ సౌకర్యం ద్వారా ధూప దీప నైవేద్య పథకం అమలు మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డీడీఎన్ అర్చకులకు ఈ సౌకర్యం వర్తించనుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 458 మంది డీడీఎన్ అర్చకులు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల డి.డి.ఎన్.ఎస్ అర్చకుల తరఫున సదానిరంజన్ సిద్ధాంతి సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.












