సంగారెడ్డి, 2026-11-27
ఎల్ నినో ప్రభావం, భూగర్భ జలమట్టాల తగ్గుదల నేపథ్యంలో రాబోయే వ్యవసాయ సీజన్‌కు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని, నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావం, భూగర్భ జలమట్టాల తగ్గుదల నేపథ్యంలో రాబోయే వ్యవసాయ సీజన్‌కు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని, నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన రైతులందరి వివరాలను నమోదు చేయడం ద్వారా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. శుక్రవారం మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, రాబోయే వ్యవసాయ సీజన్‌కు సంబంధించి ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో భూగర్భ జలమట్టాలు సాధారణ స్థాయి కంటే తగ్గి సుమారు 19 మీటర్ల లోతుకు చేరుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే వ్యవసాయ సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని, వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో సాగు చేయగల శనగ వంటి పప్పు ధాన్యాలు, తెల్ల కుసుమ వంటి నూనెగింజలు, చిరుధాన్యాలు, ఉద్యానవన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటల మార్పిడి, నీటి పొదుపు పద్ధతులను పాటించేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. పంట కోతల అనంతరం మిగిలే కొయ్యకాళ్లు, ఇతర పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం, మల్చింగ్, బయో డీకంపోజర్ల వినియోగం వంటి పద్ధతులను రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతు వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావం, భూగర్భ జలాల పరిరక్షణ, పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే విధానాలపై గ్రామసభలు, రైతు సమావేశాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించి, నీటి వనరులను పొదుపుగా వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని, వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు.






