మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టి.పి.సి.సి జాయింట్ కన్వీనర్ రామిల్ల రాధిక ఈ ఫిర్యాదు చేశారు.
టి.పి.సి.సి జాయింట్ కన్వీనర్ రామిల్ల రాధిక మాట్లాడుతూ, బల్కా సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజా నిరసనలను అణచివేసి, నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. బెల్ట్ షాపుల వ్యతిరేకంగా పోరాడిన మహిళలను కూడా పోలీస్ కేసుల్లో ఇరికించి రిమాండ్‌కు పంపించారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మళ్లీ ప్రజా ప్రతినిధిగా కొనసాగకూడదని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు ఉదయం సుమారు 9:10 గంటలకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఎస్.హెచ్.ఓకు ఫిర్యాదు చేసి, అక్నాలెడ్జ్మెంట్ స్వీకరించినట్లు రాధిక తెలిపారు. బల్కా సుమన్‌పై కఠిన చర్యలు తీసుకుని, ప్రజా జీవితంలో కొనసాగకుండా అనర్హత వేటు వేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల అధికారులను వారు డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను సహించరని పేర్కొంటూ రాధిక తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












