మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక మహిళా బృందాలకు ఆరోగ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ప్రారంభించారు.
హాజీపూర్ PHCలో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు 33 రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ సుధాకర్ నాయక్ తెలిపారు. రోజుకు సుమారు 50 మంది మహిళలకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పరీక్షల ద్వారా రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమణ వ్యాధులను సకాలంలో గుర్తించి, తక్షణ వైద్య సహాయం అందించడానికి వీలవుతుందని వివరించారు. మహిళలకు సంబంధించిన వ్యాధులతో పాటు ఇతర వ్యాధులను గుర్తించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
మొదటి రోజున 50 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించి, వాటికి సంబంధించిన వివరాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు. చికిత్సలు, అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.
వడదెబ్బ నివారణ, అసంక్రమణ వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు, 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించారు.








