రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో "అరైవ్ అలైవ్ ఫేజ్-3" కార్యక్రమంలో భాగంగా జైపూర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల సురక్షిత ప్రయాణమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన "అరైవ్ అలైవ్ ఫేజ్-3" కార్యక్రమంలో భాగంగా జైపూర్ సబ్ డివిజన్ పోలీసులు దుబ్బపల్లి ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, "అరైవ్ అలైవ్" కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు, కార్మికులు, విద్యార్థులు రోడ్డు భద్రతపై తెలుసుకున్న విషయాలను తమ పరిసరాల్లోని వారికి తెలియజేయాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించేలా చైతన్యవంతం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, వారి భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డుపై నడిచే వారిని గమనిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతో రామగుండం కమిషనరేట్‌ను ప్రమాదరహిత ప్రాంతంగా మార్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





