రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కృషి ఫలితంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపు సాధ్యమైందని మందమర్రి ఐఎన్టీయూసీ నాయకులు కాంపల్లి సమ్మయ్య, నరేందర్ తెలిపారు. ప్రభుత్వ దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు.
మందమర్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ, జనక్ ప్రసాద్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను పలుమార్లు కలిసి కార్మికుల సమస్యలు, వారి ఆర్థిక ఇబ్బందులను వివరించారని తెలిపారు.
కార్మికుల కష్టాలను ప్రభుత్వానికి నిరంతరం వివరించడం వల్ల, రాష్ట్రంలోని సుమారు కోటి 13 లక్షల మంది కార్మికులను సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్, నాన్ స్కిల్డ్, స్కిల్డ్ అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించి వేతనాలు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం రూ.12,000 వేతనం పొందుతున్న వారికి రూ.16,000 వరకు, రూ.15,000 వేతనం పొందుతున్న వారికి రూ.20,000 వరకు వేతనాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ పెంపులో జనక్ ప్రసాద్ చేసిన కృషి అభినందనీయమని నాయకులు కొనియాడారు.
కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపర్తి శ్రీనివాస్, సదయ్య, తిరుపతి, కృష్ణమోహన్, రాజేందర్, రాజ్ కుమార్, వంశీ, హరీష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.










