సంగారెడ్డి, 2026-11-26
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల దంపతుల కుమారుడు భరత్ సాయి రెడ్డిపాలక్ పటేల్ల వివాహ మహోత్సవం బుధవారం రాత్రి సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని గంజ్ మైదాన్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, జగ్గారెడ్డి, నిర్మల దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వివాహ మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, మహమ్మద్ అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ విజయశాంతి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తోట లక్ష్మీకాంత్ రావు తదితరులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
సంగారెడ్డిలో పెళ్లి సందడి
జగ్గారెడ్డి కుమారుడి వివాహ మహోత్సవానికి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్ర రాజకీయ ప్రముఖుల రాకతో వివాహ వేదిక సందడిగా మారింది. ఒకవైపు రాజకీయ ప్రముఖులు, మరోవైపు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో గంజ్ మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో భరత్ సాయి రెడ్డిపాలక్ పటేల్ల వివాహ వేడుక వైభవోపేతంగా జరిగింది.






