సంగారెడ్డి, 2026-11-20
జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మహమ్మద్ నిజామోద్దీన్ రషీద్ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పలు నూతన న్యాయ సంబంధిత పుస్తకాలను అందజేశారు. శుక్రవారం గ్రంథాలయ లైబ్రేరియన్ లలితా బాయికి పాఠకుల సౌలభ్యం కోసం ఈ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా నిజామోద్దీన్ రషీద్ మాట్లాడుతూ, తాను ఉన్నత పాఠశాల చదివే రోజుల నుంచే సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయ సభ్యుడిగా, పాఠకుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. గ్రంథాలయాల ద్వారా సమాజానికి అవసరమైన ఎన్నో బాధ్యతాయుతమైన విషయాలను తెలుసుకున్నానని, తన దృష్టిలో గ్రంథాలయాలు జ్ఞాన సంపదకు నిలయాలు, విజ్ఞానాన్ని అందించే భాండాగారాలని పేర్కొన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు సూక్తిని గుర్తుచేస్తూ, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న మాటలు పుస్తక పఠనం ప్రాధాన్యతను తెలియజేస్తాయని అన్నారు. గ్రామాల్లో గుడి, బడి ఎంత ముఖ్యమో గ్రంథాలయాలు కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. గతంలో గ్రంథాలయాల నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రజలు ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానం, అనుభవం, మానసిక వికాసానికి మరేదీ సాటిరాదని అన్నారు. ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమని పేర్కొన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆధునిక సదుపాయాలు, సాంకేతిక విధానాలతో గ్రంథాలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







