తెలంగాణ రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత, దివంగత ఎం.డి. మునీర్ స్మారకార్థం ఆయన జీవిత విశేషాలు, సేవలను ప్రతిబింబించే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 14వ తేదీ ఆదివారం స్థానిక సీఈఆర్ క్లబ్లో జరగనుంది.
మునీర్ మిత్రులు, శ్రేయోభిలాషులు జి. చందర్, వాసాల శంకర్, ఉప్పులేటి నరేష్ ఈ వివరాలను వెల్లడించారు. సింగరేణి ఉద్యోగిగా, జర్నలిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం మునీర్ నిరంతరం పోరాడారని వారు తెలిపారు. నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రజా సమస్యలపై ఆయన సమరశీల పోరాటాలు చేశారని పేర్కొన్నారు.
బొగ్గు గని కార్మికుల కష్టాలను వార్తా కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చిన ధైర్యవంతుడైన జర్నలిస్టుగా మునీర్‌ను కొనియాడారు. విద్యార్థి దశ నుంచే ప్రగతిశీల, ప్రజాస్వామ్య భావజాలంతో పనిచేసిన ఆయన సమాజానికి దిక్సూచిగా నిలిచారని చెప్పారు. మందమర్రి ముఖచిత్రంగా నిలిచిన మునీర్ చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తిగా గుర్తుండిపోతారని తెలిపారు.
“మన్నే పరమాన్నం” వంటి కథనాల ద్వారా పేదల ఆకలి బాధలను రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేసిన ప్రజల జర్నలిస్టుగా ఆయనను అభివర్ణించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమని అన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు పలువురు పత్రికా సంపాదకులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.











