పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ నివారణ చర్యలు, పొగాకు వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై మంచిర్యాల పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
మంచిర్యాల పట్టణంలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొగాకు వాడకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు ఈ మేరకు సూచనలు అందించారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ ప్రమాదం పొంచి ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూదని, దాహార్తిని తీర్చుకోవడానికి ఎల్లప్పుడూ నీటిని వెంట ఉంచుకోవాలని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇళ్లల్లోని వృద్ధులు, వేడి వల్ల కలిగే అలసటను ఎదుర్కోవడానికి, బయట పనిచేసేవారు ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. తల తిరగడం, వికారం, తీవ్రమైన అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
బెల్లంపల్లి చౌరస్తాలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ సమన్వయకర్త శ్రీమతి భారతి, జిల్లా మాస్ మీడియా అధికారి డిపి రావు, భీమయ్య, ఎపిడి బుక్క వెంకటేశ్వర్, మాలజిస్ట్ శ్రీ సుమన్ పాల్గొన్నారు.












