మంచిర్యాల జిల్లాలో ముదిరాజుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మంచిర్యాల, మందమర్రి పట్టణాలలో ఫిష్ మార్కెట్లు, ఫిషరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా యువజన అధ్యక్షుడు గరిగే సుమన్ ముదిరాజ్ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు.
గురువారం హైదరాబాద్ లో మంత్రి శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేసిన సుమన్, జిల్లాలో ఎక్కువ మంది ముదిరాజులు చేపల వేట, అమ్మకం ద్వారానే జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మార్కెట్ సౌకర్యం లేక వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ముదిరాజ్ ల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా మంచిర్యాల, మందమర్రిలో ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన స్థలం, నిధులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇంకా, మత్స్యకారుల సంక్షేమం, వారి ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో ఫిషరీ యూనిట్లను కూడా మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.












