మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 12
మత్తు పదార్థాల నియంత్రణ, నేరాల నిర్మూలన లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలో పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్రమ మద్యం, పత్రాలు లేని వాహనాలతో పాటు ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో మంచిర్యాల పట్టణ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించి భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్వయంగా క్షేత్రస్థాయిలో పాల్గొని పర్యవేక్షించారు.
యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ ఇళ్లలో రహస్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో అర్ధరాత్రి విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కోసం సుమారు 300 మంది ప్రత్యేక పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. కాలనీని పూర్తిగా చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో సుమారు రూ.20 వేల విలువైన అక్రమ మద్యం నిల్వలు, సరైన పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో కేక్ కట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన 10 మంది యువకులకు, అలాగే 10 మంది పాత నేరస్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మహానాయకుడు ఎన్టీఆర్ పేరుకు తగినట్లుగా ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వం, మంచి ప్రవర్తనతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రతి వ్యక్తి నిజాయితీగా జీవిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, మంచి పేరు సంపాదించుకోవడమే జీవిత లక్ష్యంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసుల బాధ్యత అని, అదే విధంగా ప్రతి పౌరుడు కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. రోడ్లపై అసాంఘికంగా ప్రవర్తించడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
తప్పు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అయితే యువతను శిక్షించడం కంటే వారిని సరైన మార్గంలో నడిపించడమే పోలీసు శాఖ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, యువత లక్ష్యంతో కృషి చేస్తే మంచి భవిష్యత్తును సాధించవచ్చని పేర్కొన్నారు. అవసరమైతే పోలీసు శాఖ తరఫున మార్గదర్శకత్వం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి తమ అనుభవాన్ని యువతతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తున్నామని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. పోలీసులు ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటారని, ఎన్టీఆర్ నగర్ ప్రశాంతమైన, ఆదర్శవంతమైన ప్రాంతంగా నిలవాలని ఆకాంక్షించారు.












