మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం, సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా కలెక్టర్ (రెవిన్యూ) శ్రీరాములు గారు పాల్గొన్నారు.
జిల్లాలో 28వ తేదీన 459 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా ఐదు సంవత్సరాలలోపు 76,365 మంది పిల్లలకు పోలియో వ్యాక్సినేషన్ నిర్వహించడానికి ప్రణాళికలు ఖరారయ్యాయి. అర్బన్, గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో పాటు ట్రాన్సిట్ పాయింట్లు, మొబైల్ టీంల ద్వారా వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. దీనికోసం 1836 మంది ఆరోగ్య, అంగన్వాడి, వైద్య సిబ్బందిని వినియోగించనున్నారు.
28న కేంద్రాల్లో, 29, 30 తేదీలలో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం, అవగాహన కార్యక్రమాలతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖల, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పోలియో నిర్మూలన లక్ష్యంగా చేపట్టనున్నారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, విద్యాశాఖ, మున్సిపల్ వంటి పలు శాఖల సమన్వయంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అన్ని గ్రామాలలో ఓఆర్ఎస్, మందులు అందుబాటులో ఉంచడంతో పాటు, ప్రతి మండలంలో రాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డెంగ్యూ కేసుల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులకు తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ సమీక్షలో పలువురు జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










