ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, విధ్వంసం సృష్టిస్తున్న కోతులు, కుక్కల బెడద నుండి ప్రజలను రక్షించడానికి వాటికి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా కలెక్టర్ ను కోరింది. ఈ మేరకు సమితి ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామని, అయితే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కోతులు, కుక్కల దాడులు, వాటి వల్ల జరుగుతున్న నష్టంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సమితి నాయకులు పేర్కొన్నారు. ఈ దాడుల వల్ల ప్రజలకు, పంట పొలాలకు, పండ్ల తోటలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు.
ప్రతిరోజూ కోతులు, కుక్కలు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయని, దీనివల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని, గ్రామాల్లో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని సమితి సభ్యులు వివరించారు. ముఖ్యంగా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు రోడ్డు వెంట నడిచి వెళ్లడానికి భయపడుతున్నారని, దీంతో కొందరు తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కూడా కారణమవుతోందని వారు పేర్కొన్నారు.
ఇంకా, కోతులు కూరగాయల, పండ్ల తోటలను ధ్వంసం చేస్తున్నాయని, దీనివల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇళ్ల దగ్గర తోటలు పెంచుకునే పరిస్థితి లేదని తెలిపారు. ఉదయం వేళల్లో వ్యాయామం కోసం బయటకు వెళ్లేవారు కూడా కుక్కల గుంపుల దాడులతో భయాందోళనకు గురవుతున్నారని వివరించారు. ఈ సమస్యపై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలను చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ సరైన రక్షణ చర్యలు చేపట్టలేదని సమితి సభ్యులు ఆరోపించారు.
కావున, కోతులు, కుక్కల దాడుల నుండి ప్రజలను, పంట పొలాలను, పండ్ల తోటలను కాపాడుకోవడానికి, కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లాలో వాటికి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఊరి నుండి వాటిని పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి, ఒక సంవత్సరం పాటు సంరక్షణ కేంద్రాలలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా వాటి సంతతి పెరగకుండా నిరోధించి, ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. అంతేకాకుండా, కోతులు, కుక్కల దాడుల్లో గాయపడిన వారికి, పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని సమితి ప్రతినిధులు వేముల ప్రేంసాగర్, సతీష్ కుమార్, రోళ్ళ రాజమల్లు, చాగం మల్లేష్, ముత్తళ్ళ కుమార స్వామి కలెక్టర్‌ను కోరారు.












