మందమర్రి పట్టణంలో 'శివాని హై స్కూల్' యాజమాన్యం, ప్రభుత్వ నిబంధనలను ధిక్కరిస్తూ 'శివాని శ్రీ రామ్ స్కూల్' పేరుతో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి జన సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ విద్యాశాఖ అధికారులను కోరారు.
విద్యాశాఖ అధికారికి సమర్పించిన ఫిర్యాదులో, అనుమతి లేకుండానే పాఠశాల భవనాన్ని మార్చి, పూర్తి కాని నిర్మాణాన్ని స్కూల్ భవనంగా చూపిస్తూ తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని, పత్రాలకే పరిమితమై అనుమతులు పొందినట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు.
ఇంకా, ఈ సంస్థ అనుమతి లేకుండానే 'IIT–NEET ఫౌండేషన్', 'నవోదయ కోచింగ్', 'జూనియర్ మరియు డిగ్రీ కళాశాల' పేర్లతో కూడా ప్రచారం చేస్తూ విద్యార్థులను ఆకర్షించడం చట్టవిరుద్ధమని తెలిపారు. విస్తృతంగా పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాల ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చి అడ్మిషన్లు చేపడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో చేసిన ఫిర్యాదులకు స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రవీణ్ కుమార్, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉన్నత అధికారులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.









