మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 24
మంచిర్యాల జిల్లాలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీతారామ పల్లి రైతు వేదికలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఈ శిబిరాన్ని సందర్శించి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ శిబిరంలో 123 మందికి పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు.
మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న సీతారామ పల్లి రైతు వేదికలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించి, తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.
క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా, ఫోర్ టేబుల్ మొబైల్ ఎక్స్‌రే ద్వారా శిబిరానికి వచ్చిన వారందరికీ ఎక్స్‌రే తీయడం, జెండా పరీక్ష చేయడం, వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరిగింది. అదేవిధంగా, జాతీయ అసంక్రమణ వ్యాధుల కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్తపోటు (బీపీ), షుగర్ పరీక్షలు చేయడంతో పాటు మందులు అందజేశారు. నిశ్చయ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని, ఎన్జీవోల సహకారంతో పోషకాహార కిట్లను అందజేయాలని సూచించారు.
వర్షాలు పడుతున్నందున కీటకజన్య వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటివి ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఆయా గ్రామాలలో డ్రైడే పాటించాలని, ప్రతి వారం ఇంటి చుట్టూ, పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, రోడ్డుపై అమ్మే ఆహార పదార్థాలను తినరాదని అవగాహన కల్పించారు.
ప్రభుత్వపరంగా అందిస్తున్న వైద్య సేవలను ఈ శిబిరంలో అందించారు. మాతా శిశు సంరక్షణ, టీకాల కార్యక్రమం, 14 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, కీటకజన్య వ్యాధులు, క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, అవగాహన కల్పించడం వంటివి చేపట్టాలని కోరారు.
ఈ మెగా వైద్య శిబిరంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, స్థానిక కార్పొరేటర్ సిరిమల సౌమ్య, వైద్యాధికారులు డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ ప్రియాంక, సలోని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీ నాందేవ్, టీబీ పర్యవేక్షకులు సాయి రెడ్డి, రాజేష్, మిడిల్ హెల్త్ ప్రొవైడర్స్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో మొత్తం 123 మందికి పరీక్షలు చేసి మందులు అందించారు.












