సంగారెడ్డి, 2026-11-23
పది నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుని, ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ కోసం సంగారెడ్డి జిల్లాకు వచ్చిన నలుగురు ప్రొబిషనరీ డీఎస్పీలు మహేందర్, ప్రమోద్, ప్రతిభ, మహేశ్వరిలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ఆరు నెలల పాటు పోలీసు శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు, విధులు, బాధ్యతలపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కాలంలో నేర్చుకునే అంశాలు భవిష్యత్తులో వారి సర్వీసుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించిన విధులు, వరకట్న మరణాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి తీవ్రమైన కేసుల్లో దర్యాప్తు విధానం, కేసుల నమోదు నుంచి నేర నిరూపణ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసు శాఖ పరిపాలన వంటి అంశాలపై పూర్తి అవగాహన సాధించాలని సూచించారు. ప్రతి కేసులో దర్యాప్తు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సీనియర్ అధికారుల అనుభవాలను తెలుసుకోవాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించడం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో సమర్థవంతమైన పోలీసు అధికారులుగా ఎదిగేందుకు ఈ ఆరు నెలల శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రొబిషనరీ డీఎస్పీలకు జిల్లా ఎస్పీ సూచించారు.


