మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 07
నేషనల్ హైవే 63 (ఎన్ హెచ్ 63) భూసేకరణ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద హాజీపూర్, లక్షేట్టిపేట మండలాల రైతులు ధర్నా చేపట్టారు. తమ కేసుల విచారణ కోర్టు పరిధిలో ఉండగానే నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, నోటీసు ప్రతులను దహనం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నేషనల్ హైవే 63 (ఎన్ హెచ్ 63) బాధితులు, హాజీపూర్, లక్షేట్టిపేట మండలాల రైతులు తమ కేసుల విచారణ కోర్టు పరిధిలో ఉండగానే నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవోకు వినతి పత్రం అందజేసి, నోటీసు ప్రతులను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావుతో పాటు రైతులు మాట్లాడుతూ, 2023లో నేషనల్ హైవే అధికారులు పాత రోడ్డు ప్రకారంగా రాయపట్నం నుండి వరకు అలైన్మెంట్ ఇచ్చి గెజిట్ పాస్ చేశారని తెలిపారు. అయితే, చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ రోడ్డుపై కుట్ర చేసి, స్థానికేతరులైన ఆంధ్ర కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పెద్ద ఎత్తున డబ్బులు మార్చుకొని, ఒక రాజకీయ దళారీ ద్వారా ఢిల్లీ వరకు వెళ్లి బ్రౌన్ ఫీల్డ్ అలైన్మెంట్ ను గ్రీన్ ఫీల్డ్ గా మార్చడానికి పైరవీలు చేశారని ఆధారాలతో సహా విమర్శించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన ఈ పని వల్ల వందలాది మంది రైతుల కుటుంబాలు బజారుపాలయ్యాయని, ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన రెండు మండలాల రైతులు, వారికి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూములతో జీవనం గడుపుతున్న వారిని పూర్తిగా సర్వనాశనం చేసే దిశగా ఈ అలైన్మెంట్ మార్పునకు ఆయన పూనుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని చెప్పుకునే పెద్దపల్లి ఎంపీ వంశీ, తన తండ్రి చేసిన తప్పుడు పనుల వల్ల, కొంతమంది స్వార్థ ప్రయోజన రాజకీయాల కోసం, రైతుల భూములను ఈ విధంగా లాక్కోవడం కాంగ్రెస్ పార్టీకి, కాకా కుటుంబానికి చెల్లిందని విమర్శించారు. ఆగర్బ శ్రీమంతులైన వీరు, ఆంధ్ర ఎంగిలి మెతుకుల కోసం ఎందుకు ఇంత దిగజారి రైతుల జీవితాలను ఆగం చేశారో చూస్తే, వీరికి తెలంగాణ ప్రజల అన్న, తెలంగాణ ప్రాంతంలోని రైతులపై వారికి ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థమవుతుందని అన్నారు. పార్లమెంట్ సభ్యుడు వంశీ ప్రజాస్వామ్యంపై కపట ప్రేమను ఆపి, తన తండ్రి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామి చేసిన తప్పును ఇప్పటికైనా సవరించుకొని, కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరితో మాట్లాడి వెంటనే గ్రీన్ ఫీల్డ్ ను బ్రౌన్ ఫీల్డ్ గా మార్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు హైకోర్టులో న్యాయం కోసం వేసిన కేసుపై తుది తీర్పు రాకముందే రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద నోటీసులు ఇవ్వడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ, కలెక్టర్ పూర్తిగా రైతు వ్యతిరేకిగా మారి ఆంధ్ర పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకొని, హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని, దానికి కలెక్టర్ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వందలాది మంది రైతుల జీవితాలు నాశనం అవుతున్నా, అసెంబ్లీలో ఈ రైతుల పట్ల చర్చ జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు వచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాలని డిమాండ్ చేస్తూ, రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముందరే కాంగ్రెస్ పార్టీ రైతులకు చేస్తున్న ద్రోహం, వివేక్ వెంకటస్వామి చేసిన అన్యాయాన్ని ఎలుగెత్తి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆ పరిస్థితులు రాకముందే జిల్లా కలెక్టర్ వెంటనే నోటీసులు ఉపసంహరించుకొని, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామితో మంతనాలు జరిపి, కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల నుండి బయటకు వచ్చి వెంటనే రైతుల పక్షాన నిలబడాలని కోరారు. ఎంపీ, మంత్రి ఇద్దరూ కలిసి గ్రీన్ ఫీల్డ్ ను బ్రౌన్ ఫీల్డ్ గా మార్చి, రైతులను ఆదుకోవడమే కాకుండా, రోడ్డు నిర్మాణం కోసం అయ్యే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ పై ఉందని చెప్పారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని, మీ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు అన్యాయం జరుగుతున్నా మీరు బయటికి వచ్చి మాట్లాడకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ ను మార్చే వరకు దశలవారీగా ఉద్యమాలు చేపడతామని రైతులందరూ కలిసి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావు, మున్నా రాజా సిసోడియా, కాసెట్టి నాగేశ్వరరావు, బోయిని హరికృష్ణ, మేడిపల్లి సత్యం, వడనాల శ్యాంసుందర్, లగిశెట్టి రాజమౌళి, ఉస్మాన్ పాషా, మల్లేష్, తిరుపతి, భీమన్న, మేడిపల్లి సంపత్ తో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.












