సంగారెడ్డి, 2026-11-23
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత మేరకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత మేరకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్వయంగా ఆలకించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు వినతులను పంపిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా పరిశీలించి, సమస్యల సత్వర పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 59 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. డివిజన్ల వారీగా సంగారెడ్డి డివిజన్లో 16, నారాయణఖేడ్ డివిజన్లో 8, జహీరాబాద్ డివిజన్లో 1 వినతి అందగా, కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 34 వినతులు అందాయని, అందోల్ డివిజన్లో ఎలాంటి వినతులు అందలేదని అధికారులు వెల్లడించారు. ప్రజావాణిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, పోలీస్, నీటిపారుదల, పౌరసరఫరాలు, విద్యుత్, మైనార్టీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జిల్లా ఇంటర్మీడియట్ విద్య, లీడ్ బ్యాంక్, ఎస్సీ సంక్షేమం, డీఆర్డీఏ, గృహనిర్మాణం, రిజిస్ట్రేషన్లు, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.


