సంగారెడ్డి, 2026-11-27
ప్రతి పౌరుడికి న్యాయం పొందే హక్కు ఉందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామంలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై గ్రామ ప్రజలకు వివిధ చట్టాలు, పౌరుల హక్కులు, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడినవారు, సమాజంలోని బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు చట్టాలు కల్పిస్తున్న రక్షణలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా న్యాయపరమైన సమస్య ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హతలు, మహిళల హక్కులు, గృహ హింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోటారు వాహన ప్రమాద బాధితులకు అందించే పరిహారం, లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం తదితర అంశాలను ఆమె వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న వివిధ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, న్యాయ సేవలను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, మండల వ్యవసాయ అధికారి గణేష్, గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






