సంగారెడ్డి, 2026-08-29
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నోటీసులు అందజేసిన అనంతరం తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ పొందాలని సూచించారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నోటీసులు అందజేసిన అనంతరం తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ పొందాలని సూచించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై శనివారం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల పంపిణీ, హియరింగ్ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు బూత్ లెవల్ అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ, ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సంగారెడ్డి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సంగీత, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరిస్తూ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని సీఈఓకు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నియోజకవర్గాల వారీగా ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. నోటీసుల పంపిణీని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని మరింత వేగవంతం చేయాలని ఈఆర్ఓలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజూ గరిష్ట సంఖ్యలో నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేసి, తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ పొందాలని సూచించారు.
పోలింగ్ స్టేషన్ వారీగా, మండలాల వారీగా ప్రతిరోజూ నోటీసుల పంపిణీ పురోగతిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నోటీసుల పంపిణీ పెండింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన నోటీసుల పంపిణీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తూ, అర్హులైన ప్రతి ఓటరుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సంగీత, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎన్నికల విభాగం అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.












