సంగారెడ్డి, 11 September
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని సంగారెడ్డి మున్సిపల్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఈఈ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. మట్టి వినాయక ప్రతిమలు సహజసిద్ధమైనవి కావడంతో నీటిలో సులభంగా కలిసిపోతాయని, తద్వారా చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల కాలుష్యాన్ని నియంత్రించవచ్చని వివరించారు. ప్రజలు పర్యావరణహిత వినాయక ప్రతిమలను వినియోగించి ప్రకృతి పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మున్సిపల్ అధికారులు, పీసీబీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.












