సంగారెడ్డి, 13 September
పెరుగుతున్న విద్యుత్ అవసరాల నేపథ్యంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలో భారత్ ఈవీ సోలార్ లిమిటెడ్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ వ్యవస్థలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
సంగారెడ్డి పట్టణంలో భారత్ ఈవీ సోలార్ లిమిటెడ్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయం ప్రారంభమైంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్ వినియోగం ఎంతో అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వ్యవస్థల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ అవసరాల కోసం సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత్ ఈవీ సోలార్ లిమిటెడ్ ద్వారా గృహ అవసరాలకు అనుగుణంగా ఒక కిలోవాట్ నుంచి పది కిలోవాట్ల వరకు వివిధ సామర్థ్యాలతో సోలార్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు ప్రసాద్, కళ్యాణ్ తెలిపారు. సబ్సిడీకి అర్హత ఉన్న వినియోగదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో బ్రాంచ్ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు సోలార్ విద్యుత్ వ్యవస్థలపై అవగాహన, సలహాలు మరియు సేవలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

