సారంగాపూర్ మండలం మలక్ చించొలి గ్రామానికి చెందిన సింగిరెడ్డి భోజవ్వ (55) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది స్వర్ణ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గత మూడు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భోజవ్వ కాలు విరిగింది. అప్పటి నుండి ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, నడవడానికి వాకర్ సహాయంపై ఆధారపడుతున్నారు. నిత్యం నొప్పితో బాధపడుతూ, జీవితంపై ఆశలు కోల్పోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో, బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్లి, స్వర్ణ వాగు వద్దకు చేరుకుని అందులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి భర్త భోజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నట్లు తెలిసింది.












