అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 03
జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ చిన్న పిల్లల వైద్య నిపుణులు, చర్మ సంబంధిత వ్యాధి నిపుణులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ టీకాల ద్వారా నయం చేయగల వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు సమన్వయంతో పనిచేస్తూ వ్యాధులను త్వరగా గుర్తించి, సకాలంలో వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అధ్యక్షతన ఐడిఓసిలో జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ చిన్న పిల్లల వైద్య నిపుణులు, చర్మ సంబంధిత వ్యాధి నిపుణులతో టీకాల ద్వారా నయం చేయగల వ్యాధులపై (వ్యాక్సిన్ ప్రివెంటేబుల్ డిసీజెస్) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదు చేసుకున్న 11 మంది చర్మ సంబంధిత, 22 మంది చిన్న పిల్లల వైద్య నిపుణులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య నిపుణులు సమన్వయంతో పనిచేస్తూ వ్యాధులను త్వరగా గుర్తించి, సకాలంలో వైద్య సదుపాయాలు అందించాలని డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు.
వ్యాక్సిన్ ప్రివెంటేబుల్ డిసీజెస్ (VPD) కార్యక్రమాల్లో ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా పాల్గొనాలని, ప్రభుత్వపరంగా యాక్టివ్ సర్విలెన్స్, ప్రైవేట్ వైద్యులు పాసివ్ సర్విలెన్స్ పాటించాలని సూచించారు. జిల్లా సర్విలిన్స్ అధికారి ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి వివరాలు సేకరించాలని, ముఖ్యంగా చిన్న పిల్లల ఆసుపత్రులు, చర్మ సంబంధిత వ్యాధి నిపుణుల ఆసుపత్రులను సందర్శించి సహకరించాలని కోరారు.
రక్త నమూనాలు సేకరించి, శాంపిల్స్ పంపించే ప్రక్రియ తర్వాత, ప్రత్యేక వైద్య నిపుణులను చేర్చి రోజువారీ సమాచారాన్ని సేకరించేందుకు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా త్వరగా చర్యలు చేపట్టడం, రాపిడ్ పరీక్షలు చేయించడం, తెలంగాణ డయాగ్నస్టిక్స్ లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉంచడం, అవుట్ బ్రేక్ ఏర్పడినప్పుడు తక్షణమే స్పందించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
వ్యాక్సిన్ ప్రివెంటేబుల్ డిసీజెస్ (VPD) కింద వచ్చే మీజిల్స్, డిఫ్తీరియా, టెటనస్ వంటి వ్యాధులపై సర్విలెన్స్ చేస్తూ, 100% నమోదు జరిగేలా చూడాలని కోరారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అన్ని రకాల సర్టిఫికెట్లను ఆసుపత్రులు అందుబాటులో ఉంచాలని, ఫైర్, బయో-వేస్టేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వైద్యుల వివరాలు, వైద్య సేవలకు తీసుకుంటున్న చార్జీలు, ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉండే సమయాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు.
కన్సల్టేషన్ ఫీజులు, ఇతర ఫీజులను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రదర్శించాలని, ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులకు మంచినీరు, కూర్చునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అన్ని వివరాలను నమోదు చేసుకోవాలని, లేనిచో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమీక్షలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డిపిఓ ప్రశాంతి, డిడిఎం ప్రవళిక, ఎప్పటిమాలిస్ట్ సుమన్, పలువురు చిన్న పిల్లల, చర్మ సంబంధిత వైద్య నిపుణులు పాల్గొన్నారు.











