సంగారెడ్డి, 2026-11-25
విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు రోబోటిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సదాశివపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో సోహన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు రోబోటిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సదాశివపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో సోహన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పరిజ్ఞానంతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని అన్నారు. రోబోటిక్స్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని సాంకేతిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్తులో సాంకేతిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు సోహన్ అకాడమీ చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోహన్ అకాడమీ ప్రతినిధులు, మండల విద్యాధికారి, తహసీల్దార్, కేజీబీవీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


