సంగారెడ్డి, 12 September
వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో, జిల్లా పరిషత్ కార్యాలయంలో వివిధ కుల, మత పెద్దలతో ఆయన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పీ కార్యాలయంలో వివిధ కుల, మతాలకు చెందిన పెద్దలతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రజలు ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ మత సామరస్యాన్ని కాపాడాలని అన్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల వారీగా వివిధ మతాలకు చెందిన పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా పాటలు, వ్యాఖ్యలు చేయకూడదని, తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండేలా యువతకు సూచించాలని అన్నారు. వినాయక ప్రతిమను ప్రతిష్ఠించదలచిన వారు ముందస్తు సమాచారం అందించేందుకు తెలంగాణ పోలీస్ పోర్టల్ https://policeportal.tspolice.gov.in/index.htm అందుబాటులో ఉందని తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా మండపం వివరాలు, నిమజ్జనం తేదీ, నిమజ్జనానికి వెళ్లే మార్గం తదితర వివరాలను ముందస్తుగా నమోదు చేయాలని సూచించారు. వినాయక ప్రతిష్ఠాపన కోసం ఏర్పాటు చేసే మండపాలను రహదారులపై నిర్మించకుండా, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రతా దృష్ట్యా ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక శబ్దంతో కూడిన లౌడ్స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని, నిబంధనలకు అనుగుణంగా మైకులు, స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డీజేలను ఏర్పాటు చేస్తే మండప నిర్వాహకులతో పాటు డీజే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా ద్వారా వచ్చే పుకార్లను నమ్మవద్దని, నిర్ధారణ లేని ఫార్వర్డ్ మెసేజ్లను ఇతరులకు పంపకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు, వ్యాఖ్యలు చేయవద్దని, అనుమానాస్పద సమాచారం లేదా తప్పుడు ప్రచారం కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, వివిధ మతాల పెద్దలు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంగారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ కౌన్సిలర్ కూన సంతోష్, రెవెన్యూ, మున్సిపల్, డీ.ఎమ్.హెచ్.ఓ శాఖల అధికారులు, వివిధ కుల, మతాలకు చెందిన పెద్దలు, గణేష్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.











