మంచిర్యాల కార్పొరేషన్ లో జరిగిన కౌన్సిల్ సమావేశం రాజకీయ రచ్చకు వేదికగా మారింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులు, తమ పార్టీలోని అంతర్గత విభేదాలను బహిరంగంగా ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం మంచిర్యాల ప్రతిష్టకు మచ్చ తెచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మూడు నెలలకు ఒకసారి జరిగే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి 57 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే, ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, పి ఎస్ ఆర్ వర్సెస్ జగన్ కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వర్గాలు తమ బలాబలాలను నిరూపించుకునే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో మహిళా కార్పొరేటర్లు మైకులు లాక్కోవడం, అరుపులు, కేకలు, మేయర్ పోడియం ముట్టడి, మేయర్ పై దూషణలు, ఆరోపణలు, విమర్శలు ప్రతివిమర్శల మధ్య సమావేశం గరం గరంగా సాగింది.
మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఉన్న రాజకీయ వివాదానికి కౌన్సిల్ మందిరం వేదికగా మారిందని, ఇది సరైన పద్ధతి కాదని పలువురు ఖండిస్తున్నారు. డివిజన్లలో అనేక సమస్యలు, తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ, దసరా పండుగలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కార్పొరేటర్ల ముందు ఉన్నప్పటికీ, వాటిని పక్కన పెట్టి ఆధిపత్య రాజకీయ పోరుకు తెరలేపడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
ఇప్పుడే ఇలా ఉంటే, ఇక ముందు ఎలా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ప్రజా ప్రతినిధుల ప్రవర్తనపై ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ వాతావరణం ఎలా మారుతుందో వేచి చూడాలి.











