కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా పరిధిలోని బుద్ధ విహార్ ట్రస్టులో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ కలవడంతో పాటు, బీసీల రాజకీయ అవకాశాలు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని నీలం మధు తెలిపారు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో తగిన అవకాశాలు కల్పించడం, సామాజిక న్యాయం తదితర కీలక అంశాలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు నీలం మధు పేర్కొన్నారు. తాను ప్రస్తావించిన అన్ని అంశాలపై ఖర్గే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా హమ్ తుమ్హారే సాథ్ హై మధు (మేము నీకు తోడుగా ఉన్నాం మధు) అని ఖర్గే చెప్పడం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని నీలం మధు భావోద్వేగంగా వెల్లడించారు. అనంతరం మల్లికార్జున ఖర్గేకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.











