తెలంగాణలో మిలిటెంట్ దాడులు చేస్తేనే ప్రజలలో గుర్తింపు వస్తుందంటూ బీఆర్ఎస్, టీబీజికెఎస్ నాయకులను రెచ్చగొట్టేలా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ, బాల్క సుమన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాయి.
చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బాల్క సుమన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కేటీఆర్, కేసీఆర్ ఆదేశాలతోనే బాల్క సుమన్ కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని, కేవలం ఆర్భాటాలకు, శిలాఫలకాలకే పరిమితమయ్యారని విమర్శించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటే, బాల్క సుమన్ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.











