మంచిర్యాల జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిమజ్జన ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
జిల్లావ్యాప్తంగా 2,530 గణేశ్ మండళ్లు ఏర్పాటు కాగా, గోదావరి తీరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కలిపి 41 నిమజ్జన ప్రదేశాలను సిద్ధం చేశారు. ఇందారం సమీపంలోని గోదావరి వంతెన, మండలం గూడెం, లక్షెట్టిపేట, మంచిర్యాల గౌతమేశ్వరాలయం, సీతారాంపల్లి, బెల్లంపల్లి పోచమ్మ చెరువు, చెన్నూరు పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
భారీ పోలీసు బందోబస్తు
నిమజ్జన ప్రాంతాల్లో భద్రత కోసం ముగ్గురు ఏసీపీలు, 11 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 26 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 67 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 90 మంది కానిస్టేబుళ్లు, 17 మంది మహిళా కానిస్టేబుళ్లు, 30 మంది హోంగార్డులు, 10 మంది ప్రత్యేక బృందం సిబ్బందిని మోహరించారు.
నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు, ఫ్లడ్ లైట్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. విగ్రహాల ఊరేగింపుతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో డీజేలు, బాణాసంచా వినియోగంపై నిషేధం విధించారు.
మద్యం దుకాణాల మూసివేత
నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉదయం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జిల్లాలోని బార్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ వ్యవధిలో మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు సీలు వేయనున్నారు.
గణేశ్ నవరాత్రుల సందర్భంగా జిల్లాలోని పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించడంతో కూలీలు, ప్రయాణికులు, యాచకులు, వివిధ వర్గాల ప్రజలకు ఇది ఉపయోగకరంగా మారింది.












