ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడే నాయకత్వం నేడు అత్యంత అవసరమని, ఆ కోవలోకి వచ్చే నాయకుడు రాహుల్ గాంధీ అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
దేశం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, నోట్ల రద్దు, జీఎస్టీ, రూపాయి విలువ పతనం, పెట్రోల్ ధరల పెరుగుదల వంటి ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై రాహుల్ గాంధీ నిరంతరం ప్రజల తరఫున స్వరం వినిపిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకుని వారి విశ్వాసాన్ని సంపాదించారని, దేశ యువత న్యాయం, సమాన అవకాశాలు మరియు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆయన వైపు ఆశతో చూస్తోందని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ నేడు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ, రాజ్యసభ నామినేషన్ల వ్యవహారంలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. పార్లమెంట్లో జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు సంబంధించిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు.
దేశ గౌరవం, ప్రజాస్వామ్య విలువలు మరియు రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేసిన గడ్డం వంశీకృష్ణ, “ప్రజాస్వామ్యం కోసం, న్యాయం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని అన్నారు.










