రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కేవలం రెండు మాత్రమే అమలు జరిగాయని, మిగిలినవి ప్రజలను మోసం చేసేందుకేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు ఆరోపించారు.
మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గిరిజన మహిళ తమ గ్రామంలో పాఠశాల, నీటి సౌకర్యం లేవని ప్రశ్నించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. మంత్రుల క్యాంపును మార్చడం, ముఖ్యమంత్రిని సంతృప్తి పరిచేందుకు అధికారులు తంటాలు పడటం వంటివి జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
గోదావరిపై వంతెన, టూ టౌన్ ఫ్లైఓవర్ నిర్మాణం, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి, ఉద్యోగ కల్పన, ఐటీ కారిడార్, ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం వంటి అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని రఘునాథ్ రావు విమర్శించారు.
80 శాతం పనులు పూర్తయ్యాయని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని, 10వ తేదీ నుండి మంచిర్యాలలో ఫ్లెక్సీల ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సుల్లో ప్రజలను సభలకు తరలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.










