ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన (పి.ఎం.ఎ.జి.వై.) పథకం ద్వారా గ్రామాలలో సమగ్ర అభివృద్ధి, వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం నస్పూర్ లోని జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన సమావేశంలో ఆయన పథకం అమలు తీరు, లక్ష్యాలపై అధికారులకు, ఎంపికైన గ్రామాల సర్పంచ్ లకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ప్రధాన మంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన (పి.ఎం.-అజయ్) క్రింద అమలు చేయబడుతున్న ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన (పి.ఎం.ఎ.జి.వై.) ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధి సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎంపిక చేసిన గ్రామాలను "ఆదర్శ గ్రామాలు"గా తీర్చిదిద్దడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చెన్నూర్ మండలంలోని సుందరశాల, దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట, హాజీపూర్ మండలంలోని హాజీపూర్, జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రొమ్మిపూర్, కన్నెపల్లి మండలంలోని సాలిగాం, తాండూర్ మండలంలోని చౌటుపల్లి, వేమనపల్లి మండలంలోని బయ్యారం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ గ్రామాల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు, సేవలు అందుబాటులో ఉండి, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలని ఆదేశించారు.
అనుసూచిత జాతుల పేదరికాన్ని తగ్గించడం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందించడం, ఆదాయ వృద్ధికి దోహదపడే కార్యక్రమాలను అమలు చేయడం, అలాగే ఎస్.సి. ప్రాధాన్య గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, సామాజిక-ఆర్థిక సూచికలను అభివృద్ధి చేయడం, విద్యలో ప్రవేశాలను పెంచడం, విద్యార్థులకు వసతి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు కేటాయిస్తుంది.
ఆదర్శ గ్రామ అభివృద్ధి కోసం రూపొందించే కార్యాచరణ ప్రణాళికలో గ్రామ సభ ఆమోదంతో అభివృద్ధి పనులు చేపట్టాలని, నిధుల వినియోగం, పనుల పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమన్వయంతో ఈ పథకం కొనసాగుతుందని, అవసరమైన 'గ్యాప్ ఫిల్లింగ్' నిధులను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. పథకం అమలులో గ్రామ స్థాయి సమన్వయ కమిటీలు, జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.











