సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్ వృథాను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అవసరం లేకున్నా లైట్లు, ఫ్యాన్లు ఆన్‌లో ఉంచి విద్యుత్‌ను వృథా చేస్తున్నారనే అక్షర వేకువ కథనానికి స్పందించి, కలెక్టరేట్ శాఖలకు విద్యుత్ పొదుపుపై సర్క్యులర్ జారీ చేశారు.
సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని వివిధ శాఖల్లో అధికారులు, ఉద్యోగులు అవసరం లేకున్నా లైట్లు, ఫ్యాన్లు ఆన్‌లో ఉంచి విద్యుత్‌ను వృథా చేస్తున్న విషయంపై అక్షర వేకువలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో, కార్యాలయాల్లో విద్యుత్ వృథాను అరికట్టేందుకు అదనపు కలెక్టర్ పాండు, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి చర్యలు చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి విద్యుత్ పొదుపుపై సర్క్యులర్ జారీ చేశారు. కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలను తప్పనిసరిగా ఆఫ్ చేయాలని సూచించారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించి, ప్రభుత్వ వనరులను వృథా కాకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరం లేని సమయంలో విద్యుత్ పరికరాలను ఆన్‌లో ఉంచకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. అక్షర వేకువ కథనానికి స్పందించి అధికారులు వెంటనే చర్యలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

